Internet Blackout జూలై 9కి వాయిదా పడింది..
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లోని మిలియన్ల కొద్దీ కంప్యూటర్లకి సోకిన DNSChanger అనే ట్రోజాన్ ని ఎదుర్కొవడం కోసం ఈ నెల (మార్చి 8న) FBI నిర్వహించదలుచుకున్న Internet Blackout జూలై 9కి వాయిదా పడింది. ఈ Internet Blackout ద్వారా ఏర్పడే ఇబ్బందులకు సంసిద్ధంగా ఉండడానికి కంపెనీలు, వ్యాపార, ప్రభుత్వ రంగ సంస్థలకు వెసులుబాటుగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
DNS అంటే ఏమిటి?
మనం Internet Explorer, Firefox వంటి బ్రౌజర్ల లో వివిధ వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి google.com, yahoo.com వంటి వెబ్ సైట్ అడ్రస్ లను టైప్ చేస్తుంటాం కదా. వాస్తవానికి మనం పైకి పేర్లు టైప్ చేస్తుంటాం కానీ ఆయా సంస్థల IP అడ్రస్ ద్వారా మనకు సమాచారం అందించబడుతుంటుంది.
ఉదా.కు google.com అనే వెబ్ సైట్ అడ్రస్ నే టైప్ చేశామనుకుందాం. అప్పుడు 64.233.167.104 అనే IP అడ్రస్ లో ఉన్న గూగుల్ సర్వర్ కి మన తరఫున రిక్వెస్ట్ పంపబడి అక్కడి నుండి సమాచారం సేకరించబడి మన కంప్యూటర్ స్క్రీన్ పై చూపించబడుతుంది.
ఇలా ఒక మామూలు కంప్యూటర్ యూజర్ వివిధ వెబ్ సైట్ పేర్లని టైప్ చేసిన వెంటనే ఆయా వెబ్ సైట్ల IP అడ్రస్ లకు లింక్ చేయబడే సర్వర్లనే DNS Servers అంటారు.
ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండే ప్రతీ కంప్యూటర్ కీ ఓ IP అడ్రస్ ఉన్నట్లే.. ఆ ప్రతీ కంప్యూటర్ ఎయిర్ టెల్, BSNL వంటి వివిధ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందించే DNS సర్వర్ల ద్వారా వెబ్ సైట్లని బ్రౌజ్ చేస్తుంటాయి.
మీరు కొన్నిసార్లు గమనించే ఉంటారు.. ఏదైనా సైట్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే "This page could not be found" అనే మెసేజ్ వస్తుంది. ఒకటికి రెండుసార్లు రిఫ్రెష్ చేస్తే ఆ సైట్ మళ్లీ మామూలుగానే ఓపెన్ అవుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే మనం సైట్ పేరుని టైప్ చేసిన వెంటనే ఆ సైట్ యొక్క IP అడ్రస్ మన కంప్యూటర్లో ఉన్న DNS Server ద్వారా సరిగ్గా గుర్తించబడక పేజీ కన్పించలేదని తప్పుడు మెసేజ్ చూపిస్తుంది.
DNS Changer ట్రోజాన్ ఎలా ప్రమాదం అంటే..?
DNS Changer అనే ట్రోజాన్ ఇంటర్నెట్ లో అశ్లీల సమాచారం వెదికే వారికీ, పైరేటెడ్ సాఫ్ట్ వేర్లు వాడే వారికీ, ఇప్పటికే ట్రోజాన్ ఇన్ ఫెక్ట్ అయిన నెట్ వర్క్ లలో అంతర్భాగంగా ఉన్న ఇతర కంప్యూటర్లకీ సోకుతుంది.
ఇది ఒకసారి మన కంప్యూటర్లో సోకిన వెంటనే మన ISP కాన్ఫిగర్ చేసే automatic, manual DNS Server సెట్టింగులను మార్చి వేస్తుంది.
వాటి బదులు నకిలీ DNS Serversకి మన కంప్యూటర్ ని దారి మళ్లిస్తుంది. అంటే ఇకపై మీరు google.com అని టైప్ చేస్తే అచ్ఛం గూగుల్ లాగే ఉన్న ఒక నకిలీ పేజీ రావచ్చు, అస్సలు గూగుల్ తో పోలికే లేని మరో పేజీ రావచ్చు.
అంటే కంప్యూటర్ యూజర్లు తాము వెదికే సమాచారం తాము పొందలేరు. తప్పుడు ఫలితాలు, వెబ్ సైట్లు చూడవలసి వస్తుంది. ఇలా కోట్లాది మంది కంప్యూటర్లకి ఇప్పటికే ఇన్ ఫెక్ట్ అయిన DNS Changer ట్రోజాన్ నుండి రక్షించడం కోసం FBI ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ DNS సర్వర్లని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల ఆధారంగా DNS Changer ట్రోజాన్ వ్యాప్తిని అరికట్టడానికి పూనుకుంది.
No comments:
Post a Comment